తమ దేశానికి వచ్చే విదేశీయులకు తప్పనిసరిగా కరోనా టీకా (Corona vaccine) రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని అమెరికా (America) ప్రకటించింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష(rtpcr test) నెగిటివ్ రిపోర్టు కూడా ఉండాలని స్పష్టంచేసింది. చాలా దేశాలు ఇవే నిబంధనలు విధిస్తున్నాయి. మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని ప్రముఖ ఆలయాల సందర్శనకు ధ్రువీకరణ పత్రం చూపించాలి. లేదా కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రమైనా తప్పనిసరి. అయితే టీకా ధ్రువీకరణ పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఒకే డోసు తీసుకున్నట్లు పత్రం వస్తుంటే.. మరికొందరికి ఆ సమాచారమూ అందడం లేదు.
ఎందుకిలా?
కొందరు టీకా రెండు డోసులను వేర్వేరు కేంద్రాల్లో తీసుకున్నారు. టీకా తీసుకునేముందు కొవిన్ పోర్టల్‌లో (cowin portal) లేదా ఆరోగ్యసేతులో నమోదు చేసుకోవాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు భారీఎత్తున టీకాలు అందించే క్రమంలో సొంత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాయి. ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, దాని ఆధారంగా టీకాలు ఇచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. ఇలాంటి వారికి తొలి డోసు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. నిమ్స్‌లో టీకా కార్యక్రమం ప్రారంభించే సమయంలో వైద్యులు, సిబ్బంది మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా చాలామంది టీకాలు తీసుకున్నారు. వారి పేర్లు ఆరోగ్యసేతు/కొవిన్ పోర్టల్‌లో నమోదు కాలేదు. రెండు డోసులు తీసుకున్నా ధ్రువపత్రం అందలేదు.