ప్రజల ప్రాణాలను కాపాడడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: వీహెచ్ - vh on corona
తెలంగాణలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కరోనా తీవ్రత అధికమై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారిన దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల గురించి పట్టించుకోకుండా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో కరోనా మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండడంతో క్రీడా ప్రాంగణాలను, ఫామ్ హౌస్‌లను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం, నగర శివారులో చేవెళ్ల, ఇబ్రహీం పట్నం, సంగారెడ్డి, పటాన్ చెరు, కీసర, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని ఫార్మహౌస్‌లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.