కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. వాస్తవాలు బయటపడతాయనే తనను కలువనివ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌కు పీసీసీ పదవి ఇస్తే జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
'ఎప్పుడు నేను నోరు జారి మాట్లాడలేదు. అవినీతి, భూ కబ్జాలు చేయలేదు. నాకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. వాస్తవాలు చెబుతాననే కొందరు నన్ను కలువనివ్వడం లేదు. ఏ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రివ్యూ చేయదు? గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 48 డివిజన్లు బాధ్యతలు తీసుకున్నారు కానీ కేవలం ఇద్దరిని మాత్రమే గెలిపించారు.'
వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
రేవంత్‌పై చాలా కేసులున్నాయి
తెదేపాను ముంచిన రేవంత్.. ఇప్పుడు కాంగ్రెస్‌ను ముంచాలని చూస్తున్నారని ఆరోపించారు. సోనియాకు సమాధి కట్టాలని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. ఆయనపై ఓటుకు నోటు, భూ కబ్జా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే జైలు చుట్టూ తిరగాలని ఎద్దేవా చేశారు. విజిటింగ్ కార్డులు ప్రింట్ చేస్తానని నేతల చుట్టూ తిరిగిన ఆయనకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఆయన చరిత్ర తనకు తెలుసని పేర్కొన్నారు.
డబ్బుకు అమ్ముడుపోయారు
తాను ఫోన్ చేస్తే ఇన్ఛార్జ్ మానిక్కం ఠాగూర్ స్పందించడం లేదని అన్నారు. ప్యాకేజీలకు ఆయన అమ్ముడు పోయి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తప్పుడు నివేదిక పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ వాళ్లు ఏది చెబితే అది వినాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో కొందరు డబ్బులకు అలవాటు పడ్డారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వారి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని వీహెచ్ పేర్కొన్నారు. అధిష్ఠానానికి అన్ని వివరాలు చెప్పినా కూడా రేవంత్‌కే పీసీసీ ఇస్తే తాము చేసేది చేస్తామని ఉద్ఘాటించారు.
'రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే జైలు చుట్టూ తిరగాలి' ఇదీ చదవండి:క్రికెట్ బ్యాట్ పట్టిన మంత్రి ఎర్రబెల్లి