తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదాలకు నిలయంగా యూటర్న్‌లు.. కనిపించని ప్రమాద సూచీలు - Bhootpur Mahbubnagar Road

Hyderabad Raichur Road: రోడ్లు విస్తరించారు. విభాగినులు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ల మధ్య మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాలమైన రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను మాత్రం మరిచారు. ఎత్తుగా, ఏపుగా పెరిగిన చెట్లు యూటర్న్‌ల ప్రమాదాలకు కారణం అవుతుంటే.. అక్కడ యూటర్న్ ఉందని, వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలని బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం వాహనదారులకు ప్రాణసంకటంగా మారుతోంది.

road accidents
road accidents

By

Published : Nov 13, 2022, 7:20 AM IST

ప్రమాదాలకు నిలయంగా యూటర్న్‌లు.. కనిపించని ప్రమాద సూచీలు

Hyderabad Raichur Road: మహబూబ్‌నగర్‌లో నాలుగు వరుసలుగా విస్తరించిన రహదారులపై ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన యూటర్న్‌లు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. పాలమూరులో హైదరాబాద్-రాయచూర్, భూత్పూరు-మహబూబ్‌నగర్‌ వెళ్లే రహదారులను చూడ్డానికి అందంగా తీర్చిదిద్దారు. రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రోడ్లు విశాలంగా ఉండటంతో భారీ వాహనాలు సహా కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు వేగంగా దూసుకెళుతున్నాయి.

రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యమిచ్చిన అధికారులు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టలేదు. ఆ చర్యల్లో లోపాల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏనుగొండ నుంచి హనుమాన్‌పుర, బస్టాండ్ నుంచి తెలంగాణ కూడలి, మల్లికార్జున చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్, న్యూటౌన్ నుంచి రాజేంద్రనగర్ రోడ్డు, మహబూబ్‌నగర్‌ బైపాస్ చాలా మార్గాల్లో డివైడర్ల మధ్యలో మొక్కల్ని పెంచారు. ఈ మార్గాల్లో చాలా చోట్ల యూటర్న్‌లు ఉన్నాయి.

ఎత్తుగా పెరిగిన చెట్ల కారణంగా ఒకవైపు నుంచి మరో వైపునకు మళ్లే వాహనాలు ఎదురుగా వచ్చే వాహన చోదకులకు కనిపించడం లేదు. దీంతో వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. యూటర్న్‌ల వద్ద సూచిక బోర్డులు, విద్యుత్తు ట్రాఫిక్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు, బోర్డులు లేవు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు యూటర్న్ వద్ద మలుపు తిరిగే వాహనాల్ని గమనించకుండా ఢీ కొడుతున్నారు. నాలుగు నెలల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. మర్లు నుంచి పాలకొండకు వెళ్లే దారిలో బైపాస్ యూటర్న్ వద్ద పాదచారులు నడిచేలా తెల్లటి చారలు ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల అవి కనిపించడం లేదు.

అతివేగం, అపసవ్యదిశలో ప్రయాణం, యూటర్న్‌ల వద్ద రోడ్డు వైశాల్యం పెంచకపోవడం లాంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లోపాలనన్నింటి సవరిస్తే తప్ప పాలమూరులో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడదని.. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్‌లను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నా..వీలైనంత త్వరగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details