తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరిని ఓడించాలి' - తెరాస బాజపా ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్తమ్ విమర్శ

ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, పల్లా రాజేశ్వరరెడ్డిలు ఏ మాత్రం పనులు చేయలేదని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో వారిద్దరిని ఓడగొట్టి కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని జూమ్ యాప్ ద్వారా పీసీసీ అనుబంధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం జరిపారు.

uttam kumar said MLC elections must defeat those two members
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరిని ఓడించాలి'

By

Published : Feb 19, 2021, 8:35 PM IST

జూమ్ యాప్ ద్వారా పీసీసీ అనుబంధ సంస్థల ప్రతినిధులతో ఉత్తమ్ చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్యెల్సీ రాములు నాయక్​లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టామన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నల్గొండ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలు ఒక్క పని కూడా చేయలేదని ఉత్తమ్ ఆరోపించారు. వారిని ఓడించేందుకు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు.

చిన్నారెడ్డి వ్యవసాయ రంగంలో పీహెచ్డీ చేసిన వ్యక్తని, నిజాయితీపరుడని, సౌమ్యుడుని ఉత్తమ్​ కొనియాడారు. రాములు నాయక్ నిరుపేద కుటుంబంలో పుట్టి... తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనుసరించే కాంగ్రెస్ జనరల్ స్థానంలో.. గిరిజన అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని చెప్పారు. వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిపించాలని కోరారు.

తెరాస 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. ఇటీవల రెండు మూడు రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని కేటీఆర్ ప్రకటించినా... ఇప్పటి వరకు ఇవ్వట్లేదని ఆరోపించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను దెబ్బకొడితే.. రావాల్సిన 3,016 నిరుద్యోగ భృతి వస్తుందన్నారు.

రాష్ట్రానికి భాజపా తీరని అన్యాయం చేస్తోందని, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. తాము కూడా హిందువులమే... అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ, భద్రాచలం రామాలయానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా, తెరాసను ఓడించాలని ఉత్తమ్‌కుమార్ కోరారు.

ఇదీ చూడండి :'భాజపా, తెరాస కలిసి రైతులను మోసం చేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details