కరోనా నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను కూలీల సొంత గ్రామాల్లో చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కాలంలో కూలీలు రోజుకు కనీసం 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పని ప్రదేశానికి వెళుతున్నారని చెప్పారు. ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఒకే ఆటోలో కనీసం 14 నుంచి 15 మంది, ట్రాక్టర్‌లో 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పాటించాల్సిన రక్షణ పద్ధతులు ఏమీ అనుసరించకపోవడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.