Uttam Kumar Reddy on Telangana Assembly Elections 2023 :కాంగ్రెస్ హామీ ఇస్తే అమలు చేసి తీరుతుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకలో కోటి మంది మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. అక్కడ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
కర్ణాటకలో రేషన్ ద్వారా 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. అక్కడ వంద రోజుల్లోపే ఇచ్చిన 5 గ్యారెంటీ హామీల్లో.. నాలుగింటిని అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేయలేదని (UttamKumar Reddy on BRS) ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. ఉచిత ఎరువుల పంపిణీ హామీకే పరిమితమైందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.
ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం
UttamKumar Reddy Fires on BRS : కేసీఆర్, కేటీఆర్ కలల్లో బతుకుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి (UttamKumar Reddy Fires on KCR and KTR) ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు.. సాండ్, ల్యాండ్, లిక్కర్, కరెప్షన్ మాఫియాగా మారారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో.. తనకు తెలియదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్, కోదాడలో మెజార్టీ 50,000 కంటే తగ్గదని అన్నారు. ఒకవేళ 50,000 కంటే మెజార్టీ తగ్గితే మళ్లీ రాజకీయాలు చేయనని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే పార్టీ పోటీ చేయవద్దంటే పోటీ చేయనని.. ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని చెప్పారు. ఎన్నికలు అనేవి ఒక్క డబ్బు మీదనే ఆధారపడవని.. పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలను కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నారు. గడిచిన 6 నెలల్లో కాంగ్రెస్ బాగా బలపడిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.