పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కృష్ణానదిపై మొదలు పెట్టాలనుకున్న, ఇప్పుడున్న వాటిని విస్తరించాలనుకున్న ప్రాజెక్టులకు చెంది సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు రెండు లేఖలు రాసినా... సమాధానం ఇవ్వలేదని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు కృష్ణానదిపై నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేట్లు ఏపీ ప్రాజెక్టులను చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఈ ఏడాది మే 11న సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసిందన్నారు.
కానీ ఏపీ ప్రభుత్వం 203, 388 జీవోలు ఇచ్చి తద్వారా పనులు చేపట్టి, చట్టవిరుద్ధంగా కృష్ణ బేసిన్ నీటిని పెన్నార్ బేసిన్‌కు తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తక్షణమే సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. ఇది జరగనట్లయితే కృష్ణా పరీవాహక ప్రాంతంతోపాటు నాగర్జున సాగర్, కెఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐఎస్, దిండి, ఎస్‌ఎల్‌బీసీ, ఎఎమ్‌ఆర్‌పీ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.