టీఎస్ఆర్టీసీ గతేడాది జూన్ 19న కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరమైన వస్తువులను సరైన సమయానికి, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంతో... ప్రజలు ఆదరించారు. రైతులకు సేవలు అందించాలని నిర్ణయించిన ఆర్టీసీ..... గతేడాది సుమారు వెయ్యి కార్గో బస్సుల్లో వ్యవసాయ ఉత్పత్తులను చేరవేసింది. కొద్దిరోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... కల్లాల వద్దకే కార్గో బస్సులను నడిపించాలని ఆర్టీసీ భావిస్తోంది.
రైతులు వినియోగించుకునేలా
ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్టీసీ రీజనల్ మేనేజర్లతో సమావేశాలు నిర్ణయించింది. కార్గో బస్సులను రైతులు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని... ఆయా జిల్లా కలెక్టర్లకు అధికారులు లేఖలు రాశారు. పది టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో బస్సుకు 4,420 రూపాయలు, నాలుగు టన్నుల సామర్థ్యమున్న కార్గో బస్సులకు 3,620 రూపాయలు చెల్లించి... వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులు ఆసక్తి
ఇప్పటికే కార్గో బస్సులను వినియోగించుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు తెలిపారు. జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల నుంచి మామిడికాయలు, నకిరేకల్ నుంచి నిమ్మకాయలు చేరవేసేందుకు కార్గో బస్సులు కావాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే... వాటిని విమానాశ్రయం వరకు తరలించే సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.