akhiesh yadav met kcr: ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయాలని అనుకున్నట్లు సమాచారం. అఖిలేష్ యాదవ్, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్‌లు శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ భేటీలో నేతలు చర్చించారు.
కేంద్రం దుష్ట సంప్రదాయం..:కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విపక్ష ప్రభుత్వాల్లోని మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉసిగొల్పుతూ దుష్ట సంప్రదాయానికి తెర తీసిందనే అంశంలో నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయని... ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, దిల్లీ, హరియాణాల్లోనూ విస్తరించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. పరస్పర విస్తరణకు ప్రాంతీయ పార్టీలు సహకరించుకోవాలని.. ఫలితంగా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపొచ్చని చర్చించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్‌లు వదులుకున్న లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంపైనా చర్చ సాగినట్లు తెలిసింది.