రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాలు, పెన్షన్లలో కూడా కోత విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని యూటీఎఫ్ స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ దోమలగూడలోని యూటీఎఫ్ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లాక్డౌన్ నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతలు అమలు చేయటంవలన లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నాయని యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించలేక పోవటమే ఈ దుస్థితికి కారణమన్నారు. అందుకు ప్రధాన బాధ్యత టీఎన్జీవో, టీజీఓ సంఘాల నాయకులదేనని సమావేశం అభిప్రాయపడిందన్నారు.
ఉద్యోగుల విజ్ఞప్తులను పట్టించుకోకుండా జీతాల్లో కోత విధించటాన్ని నిరసిస్తూ జూన్ 1న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాల్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిరసనలో పాల్గొనాలని సూచించారు.
నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా స్థాయిలో కలెక్టర్కు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వాలన్నారు. జూన్ మొదటి వారంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్లో ఆఫ్లైన్లో నిర్వహించి... పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, సీఎం ఇచ్చిన హామీలు తదితర సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చిస్తామన్నారు.