USPC representatives met Revanth Reddy: రాష్ట్రంలో జీవో 317 తో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులకు.. అధైర్యపడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం తెచ్చిన 317 జీవో రద్దు కోసం తాము చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డిని.. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు కోరారు. అదేవిధంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రమ గోవర్ధన్, సీపీఎం, టీజేఎస్ నాయకులను కలిసి 317 జీవోలోని లోపాలను, ఆ జీవో అమలు తీరు, బాధిత ఉపాధ్యాయుల విజ్ఞప్తులు, పరిష్కారంలో జాప్యం తదితర అంశాలను వివరించారు. తాము కలిసిన నేతలందరూ తమ ఆందోళనలకు మద్దతు ప్రకటించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..
317 జీవో వల్ల జరుగుతున్న అన్యాయాలను, స్థానికతను కోల్పోతున్న వైనాన్ని రేవంత్ రెడ్డికి సంఘాల ప్రతినిధులు వివరించారు. జీవో మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న బదిలీలు, కేటాయింపుల కారణంగా మనస్తాపం చెంది ఉద్యోగులు చనిపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని రేవంత్ రెడ్డి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా, పోరాటాలు చేసినా ప్రయోజనం లేదని ఆరోపించారు.