తెలంగాణ

telangana

ETV Bharat / state

USPC Demands for Techers Promotions : 'సెలవులు అయ్యేలోగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి' - telangana latest news

USPC Demands for Techers Promotions : పాఠశాలలు ప్రారంభం అవ్వడానికి ముందే వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్​ను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడే దిశగా చొరవ తీసుకుంటామని యుఎస్​పీసీ సమావేశం తీర్మానించింది.

USPC Demands for Techers Promotions
'వేసవి సెలవులు అయ్యేలోగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి'

By

Published : May 14, 2023, 7:19 PM IST

USPC Demands for Techers Promotions : పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని యుఎస్​పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ దోమలగూడలోని కె.జంగయ్య అధ్యక్షతన టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యుఎస్​పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులను గురించి ఈ సమావేశం సమీక్షించింది.

తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలి: ఉపాధ్యాయుల బదిలీల జీఓపై హైకోర్టు స్టే కొనసాగుతున్నందున మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందని, పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, చావ రవి తెలిపారు. విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, పదోన్నతులు, నియామకాల ద్వారానే ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. బదిలీలపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలని, తద్వారా ఏర్పడిన ఖాళీల్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని యుఎస్​పీసీ సమావేశంలో డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు చేసి గెలుస్తున్న పార్టీలు:ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించారని, సీపీఎస్ రద్దు వాగ్దానం చేసి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్ర బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, బకాయి ఉన్న మూడు డీఏలను ప్రకటించాలన్నారు. జులై 1, 2023 నుంచి నూతన వేతన సవరణ అమలు జరిగే విధంగా తెలంగాణ రెండే పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఐక్యంగా ఉద్యమిస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దానికోసం యుఎస్​పీసీగా అన్ని సంఘాలతో చర్చించటానికి చొరవ తీసుకోవాలని సమావేశం తీర్మానించిందని వారు వివరించారు. ఈ భేటీలో యుఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్ కుమార్, ఎం.రవీందర్, ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, కొమ్ము రమేష్, ఎన్.యాదగిరి, జాడి రాజన్న, మేడి చరణ్ దాస్, కె.భిక్షపతి, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details