కపిలతీర్థం-అలిపిరి రహదారిలో శేషాచలం అటవీ ప్రాంతంలో భాగంగా నిర్మించిన నగరవనం... తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన విహారస్థలం. నగరానికే తలమానికంగా నిలిచి ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతంలో గడిపేందుకు స్థానికులు పోటెత్తుతారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు విరామ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్తుంటారు. ఎర్రచందనం వృక్షాల మధ్య ఉండే ప్రత్యేకమైన వాతావరణమే ఇందుకు కారణం. లాక్‌డౌన్ నిషేధాజ్ఞలతో దాదాపు 8 నెలలు నగరవనం మూతపడింది. సందర్శకులు లేక వెలవెలబోయిన ఈ ప్రాంతం ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది.
ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు
కొవిడ్ భయంతో ఇళ్లకే పరిమితమైన తిరుపతివాసులు నగరవనం ప్రారంభమైందని తెలుసుకుని ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబసభ్యులతో కలసి వారాంతాల్లో ఇక్కడే గడపుతున్నారు. ఆటపరికరాలూ ఇక్కడ ఉండటంతో చిన్నారులూ నగరవనానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సందర్శకులకు మాస్క్ తప్పనిసరి చేయటమేగాక పరిమిత సమయాల్లోనే అనుమతిస్తున్నారు. నడక కోసం వచ్చే స్థానికులను ఉదయం 7 నుంచి 9 వరకూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకే లోపలికి పంపుతున్నారు.