Uppal Skywalk inauguration in April : హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకి వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. కొవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. దీంతో రహదారులన్నీ వాహనాలతోనే కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటరు ప్రయాణానికే.. కొన్ని సందర్భాల్లో 15 నిమిషాల సమయం దాకా పడుతోంది. వీవీఐపీల పర్యటనలకు గాను ట్రాఫిక్ పోలీసులు తరచూ వాహనాలను నిలిపేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు రోడ్ల మీదే నిమిషాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
హైదరాబాద్‌లో.. ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏక్కువగా ఉంది?: హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కూడళ్ల వద్ద సిగ్నళ్లను దాటి వెళ్లడానికి చాలా సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మియాపూర్ చౌరస్తా, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అత్తాపూర్, నానల్ నగర్, ఉప్పల్, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిలింనగర్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది.
దిల్సుఖ్నగర్ చౌరస్తా, మెహదీపట్నం బస్టాప్‌ల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో అయితే ట్రాఫిక్‌ను కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు పాదచారులు రోడ్డు దాటేందుకు కొంత సమయం కేటాయించి, తరువాత వాహనాలు వెళ్లేందుకు సిగ్నళ్లు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కూడా పాదచారులు మధ్యమధ్యలో రోడ్డు దాటుతునే ఉన్నారు. దీని మధ్యలోనే వాహనాలు నిలిచిపోతున్నాయి.