గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని దాదాపు 20 కాలనీల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. చాలా రోజులుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలు తొలగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు.
పేదవాడికి స్థిరాస్తిపై యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా బస్తీలు, కాలనీలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నిస్తామని అన్నారు. కేసీఆర్ నగర్ లాంటి కాలనీలను డీనోటిఫై చేయడం ద్వారా ఆయా కాలనీల్లోని ప్రజలకు ఉపయుక్తంగా మారిందని... ఇతర కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పురపాలకశాఖ సిద్ధంగా ఉందని అన్నారు.
ధరణితో ప్రయోజనం
ధరణి ద్వారా నగరంలో ఉన్న ప్రతి ఇంచు భూమికి సంబంధించిన వివరాలకు అనుగుణంగా యాజమాన్య హక్కులను పొందే వీలు కలుగుతుందని కేటీఆర్ చెప్పారు. ధరణి ద్వారా భూయాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుందని... అవినీతిరహితంగా, వేగంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఎక్కువగా ఇంకెవరికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంటుందని మంత్రి ప్రశ్నించారు.