హైదరాబాద్‌లోని నల్లకుంటలో లీడర్స్ ఫర్ సేవా సంస్థ చేపట్టిన నిత్య జనగణమన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. నిత్య జనగణమన కార్యక్రమం ద్వారా జాతీయతా స్ఫూర్తిని విస్తరింపజేస్తున్న సంస్థ నిర్వాహకులు నేలంటి మధు, మల్లాడి క్రాంతి, సర్వు అశోక్, జూకంటి ప్రశాంత్, ఎం.కె. శ్రీనివాస్, నల్ల ప్రవీణ్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిత్య జన గణ మన కార్యక్రమం వినూత్నంగా ఉందన్న ఆయన నిర్వాహకులను కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.
జమ్మికుంట నుంచి బైక్ ర్యాలీ ద్వారా జాతీయ జెండాను తీసుకొచ్చి.. ఇక్కడ స్థాపించి 50 రోజులుగా ప్రతిరోజు జనగణమన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కేశవ్‌ప్రసాద్ మౌర్యకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కేశవ్‌ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్ఫూర్తిమంతమైన కార్యక్రమాన్ని ప్రతిచోట, ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు జి.గౌతమ్ రావు, స్థానిక కౌన్సిలర్ వై.అమృత, పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.