ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్యం పీఠముడి వీడేలా లేదు. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి ఇద్దరు భార్యల కుమారుల మధ్య వివాదం ఇప్పుడప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మకు మైనర్లు అయిన ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి తనకే పీఠం కావాలని మొదటి నుంచి పట్టుపడుతుండగా..... రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కూడా తనకు వీలునామా ఉందని తన కుమారులకే పీఠం కావాలని భీష్మించుకుంది. వివాదం ప్రభుత్వం వరకు వెళ్లడంతో...ఏకాభిప్రాయానికి రావాల్సింది మంత్రి వెల్లంపల్లి ఇరువురు కుటుంబసభ్యులను ఆదేశించారు.
Brahmamgari matam: కొలిక్కిరాని పీఠాధిపత్యం సమస్య
ఏపీలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్య సమస్య ఇపుడే కొలిక్కి వచ్చేలా లేదు. కుటుంబసభ్యుల మధ్య సయోధ్య కుదరక పోగా.. అంతరం మరింత పెరిగింది. ఏకాభిప్రాయంతో నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా... వారసుల మధ్య పీఠముడి కొనసాగుతోంది. ఇద్దరి మధ్య మొదలైన పీఠాధిపత్యం ఇప్పుడు ముగ్గురి మధ్య పోటీగా మారి మరింత జటిలమైంది.
మఠంలో సమావేశమైన ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు చర్చించినా సయోధ్య కుదరలేదు. ఇప్పటి వరకు పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ మధ్య పీఠం కోసం వివాదం నెలకొనగా..ఇప్పడు మరొకరు జత కలిశారు. వెంకటాద్రిస్వామి సోదరుడు భద్రయ్యస్వామి కూడా పీఠం కోసం పట్టుబడుతున్నారు. గతంలో తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కిడ్నీ దానం చేశానని.... ఆ సమయంలో తన తండ్రి తనకే పీఠం ఇచ్చేలా వీలునామా రాశాడని చెబుతున్నాడు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ సైతం పీఠాధిపత్యం ఇస్తే తమకు ఇవ్వాలని లేకుంటే భద్రయ్యస్వామికి ఇచ్చినా సమ్మతమేనని చెప్పినట్లు సమాచారం. దీన్ని వెంకటాద్రిస్వామి మాత్రం అంగకరీంచడం లేదు. బుధవారం మరోసారి కుటుంబసభ్యులు సమావేశం కానున్నారు. ఏకాభిప్రాయానికి రాకుంటే ప్రభుత్వమే కమిటీ వేసి పీఠాధిపతిని నియమించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి: ఎస్పీ సునీల్ దత్