దక్షిణ మధ్య రైల్వే దశల వారీగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. అందులో భాగంగా స్థానిక ప్రయాణికులకు ఉపయోగపడేలా ఈ నెల 19 నుంచి అన్ రిజర్వ్‌డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడపబడతాయని రైల్వే శాఖ తెలిపింది. వీటితో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది.
దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం ముఖ్యమైన మార్గాల్లో పట్టాల పటిష్ఠత కోసం అనేక పనులను చేపట్టింది. ఫలితంగా రైళ్ల వేగం పెరిగి ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఈ రైళ్లు అన్ రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులుగా నడపడానికి వీలు కలిగిందని రైల్వేశాఖ పేర్కొంది. ఈ నెల 19 నుంచి 82 రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 82 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నడపడం వల్ల ప్రయాణికులందరికి సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించింది.
ప్రయాణికులు టికెట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చని రైల్వేశాఖ తెలిపింది. స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతో పాటు యూటీఎస్ యాప్(ఆన్‌లైన్), ఏటీవీఎమ్ (ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్), సీవోటీవీఎమ్‌లు (కాయిన్ టికెట్ వెండింగ్ మెషిన్స్) మొదలగు వాటిల్లో టికెట్లు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
నిబంధనలు పాటించాలి..
మరోవైపు కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. ప్రయాణికులు సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ప్రయాణ సమయం మొత్తంలో మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి ప్రయాణికులు కారకులు కావొద్దని విజ్ఞప్తి చేశారు.