తెలంగాణ

telangana

ETV Bharat / state

సడలింపులిచ్చినా... నిర్మాణరంగానికి అడ్డంకులే! - construction sector in telangana

లాక్‌డౌన్‌ నుంచి నిర్మాణ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మినహాయింపులిచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనే చందంగా మారింది. సిమెంటు బస్తాపై 70 నుంచి 100 రూపాయలు పెరగడం, కార్మికుల కొరత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తున్నాయి.

Unlimited barriers to the construction sector in telangana
సడలింపులిచ్చినా... నిర్మాణరంగానికి తగ్గని అడ్డంకులు

By

Published : May 22, 2020, 12:19 PM IST

లాక్‌డౌన్‌ ప్రభావం రాష్ట్రంలోని నిర్మాణం రంగంపై కొనసాగుతోంది. ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చినా... 20 నుంచి 25 శాతానికి మించి పనులు జరగడం లేదు. వలస కార్మికులు వెళ్లిపోవడం, స్థానిక కార్మికులు రావడానికి చొరవ చూపకపోవడం, సిమెంటు ధరల అమాంతంగా పెరగడం వల్ల నిర్మాణాలు సాగని పరిస్థితి.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు పది లక్షల మంది నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో నిర్మాణాలు ఆగిపోవడం వల్ల వారు స్వగ్రామాల బాట పట్టారు. బిల్డర్లు, డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా కాదని వ్యయప్రయాసాలకొర్చి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులను ఆపేందుకు డెవలపర్స్‌ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అయినప్పటికీ వారు వెనక్కితగ్గకపోవడంతో... నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో మొదలు కాలేదు. లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీల వసతి కోసం డెవలపర్లు, బిల్డర్లు దాదాపు 80 కోట్లు ఖర్చు చేసినట్లు హైదరాబాద్‌ క్రెడాయ్‌ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ కూలీలను ఆపే పరిస్థితుల్లేవని ఆయన తెలిపారు.

ఇదేసమయంలో లాక్‌డౌన్‌ను సాకుగా చూపి సిమెంటు పరిశ్రమలు ఒక్కో బస్తాపై 70 నుంచి 100 రూపాయలు పెంచేశాయి. సిమెంటు గ్రేడ్‌ను బట్టి 230 నుంచి 270 వరకు బస్తా ధర ఉండగా ఇప్పుడేమో 360 నుంచి 400 రూపాయల వరకు పెరిగింది. ఇటీవల ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద బిల్డర్లు, సిమెంటు పరిశ్రమల ప్రతినిధుల సమావేశం జరిగింది.

సిమెంటు ధరలు పెరగడం... నిర్మాణరంగానికి తీవ్ర విఘాతమని నిర్మాణ రంగ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందరి మద్దతు ఉంటేనే ముందుకు వెళ్లగలమని...సిమెంటు పరిశ్రమలను కూడా కోరామని క్రెడాయ్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఇటుకలు, ఇసుక, ఇతర ముడిసరుకుల ధరలు కూడా పెరిగినట్లు నిర్మాణదారులు చెబుతున్నారు.

పూర్తి స్థాయిలో నిర్మాణరంగానికి చెందిన పనులు జరగాలంటే మరో మూడు నాలుగు నెలలు పట్టొచ్చని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగం ఇప్పటికిప్పుడు ముందుకెళ్లడం అంత సులభం కాదని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:చూడ'చెక్కిన' తాజ్​మహల్​.. చూపులకే సవాల్​

ABOUT THE AUTHOR

...view details