తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ దృష్ట్యా పనివేళలు కుదించాలి: బ్యాంకు యూనియన్లు

కొవిడ్​ దృష్ట్యా బ్యాంకు పని వేళలను కుదించాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్లు డిమాండ్‌ చేశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కుదించాలని... 50 శాతం ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తించేట్లు చూడాలని పేర్కొంటున్నాయి.

bank, covid
బ్యాంకు

By

Published : Apr 29, 2021, 6:58 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న దృష్ట్యా బ్యాంకు పని వేళలను కుదించాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్లు డిమాండ్‌ చేశాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎల్బీసీ నివేదించినా... నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆల్‌ ఇండియా బ్యాంకు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుక్కయ్య, ప్రధాన కార్యదర్శి గాలేటి నాగేశ్వర్‌ ఆరోపించారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 3,975 మంది బ్యాంకర్లు కరోనా బారిన పడ్డారని, 75 నుంచి 80 మంది మృతి చెందారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 16న బ్యాంకు యూనియన్ల తరఫున తమ డిమాండ్లను ఎస్ఎల్‌బీసీకి వినతి పత్రం ఇవ్వగా 21న వర్చువల్‌ విధానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వాటిని ఆమోదించారని వివరించారు.

ప్రధానంగా బ్యాంకు పని వేళలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కుదించాలని... 50 శాతం ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తించేట్లు చూడాలని కోరినట్లు వారు తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే బ్యాంకులకు ఖాతాదారులు వచ్చేట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్న వారు... ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బ్యాంకర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అప్పుడే కాదు: డీహెచ్‌ శ్రీనివాస్‌

ABOUT THE AUTHOR

...view details