సంక్రాంతి పండగలో కొన్ని పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సంప్రదాయం పేరు చెప్పి తిన్నా... వీటి నుంచి అందే పోషకాలు ఎంతో మేలు చేస్తాయి.
బెల్లం:శరీరం నుంచి ట్యాక్సిన్లనూ తొలగించి కాలేయాన్ని కాపాడుతుంది. బెల్లంలోని ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలో అధిక సోడియం నిల్వల్ని నిర్వీర్యం చేసి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఒంట్లోని నీటిని తగ్గిస్తుంది. ఓ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు త్వరగా జీర్ణమవుతుంది. బెల్లం శరీరంలోని అనేక ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
చెరకు:ఇవాళ కట్టెల పొయ్యి మీద... చేసే పొంగలిని కలియబెట్టడానికి చెరకు గడలను వాడతారు. అది అదనపు రుచిని తెచ్చిపెడుతుంది మరి. అతిదాహం, అతి వేడితో బాధపడే వారికిది చక్కటి పరిష్కారం. ఇందులో ఎక్కువగా ఉండే పీచు కొవ్వుని త్వరగా కరిగిస్తుంది. పిండి పదార్థాలూ, మాంసకృత్తులు, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి ఖనిజాలూ, ఎ, బి, సి విటమిన్లూ సమృద్ధిగా ఉండటం వల్ల పోషకలేమి సమస్య రాదు. ఖనిజాలు దంతాలకూ, ఎముకలకూ బలాన్నిస్తే... పీచు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇతర పోషకాలు మూత్రపిండాలూ, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.