తెలంగాణ

telangana

ETV Bharat / state

central clarity on paddy procurement : స్పష్టంగా చెప్పాం.. అయినా తెరాస గందరగోళం సృష్టిస్తోంది: పీయూష్‌ గోయల్‌

central clarity on paddy procurement : తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందన్న ఆయన.... అదే నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని సూచించారు.

paddy issue in parliament
paddy issue in parliament

By

Published : Dec 3, 2021, 5:49 PM IST

Updated : Dec 3, 2021, 7:11 PM IST

'ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం'

central clarity on paddy procurement : ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేస్తున్నారని.... రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్న కేశవరావు ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్న పీయూష్ గోయల్... ఈ మేరకు సీఎం కేసీఆర్​తో కూడా మాట్లాడానని తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు.

trs mp k.kesava rao: 'తెలంగాణ నుంచి అన్ని రకాల ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందా? సంక్షేమ పథకాలు, రాష్ట్ర వినియోగం తర్వాత మిగిలిన ధాన్యాన్ని కస్టమ్ రైస్‌ మిల్లింగ్‌ ద్వారా కేంద్రానికి ఇస్తుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. గతేడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. ఈఏడాది 19 లక్షల టన్నులను మాత్రమే తీసుకున్నారు. గతేడాది పరిమాణం మాదిరే తీసుకుంటారా?'- కేశవరావు, రాజ్యసభ సభ్యుడు

union minister piyush goyal : 'సెంట్రల్‌ పూల్‌ కోసం కేంద్రం ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నాం. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను బాగా పెంచాం. 2018-19లో 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నులను సేకరించాం. ఖరీఫ్‌లో 50 లక్షల టన్ను ఇస్తామని తెలంగాణ చెప్పింది. కానీ 32.66 లక్షల టన్నులే ఇచ్చింది. రబీలో 55 లక్షల టన్నులు అంచనాలున్నా 61.8 లక్షలు టన్నులు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం తరఫున 94.5 లక్షల టన్నుల వరకూ సేకరిస్తామని చెప్పాం. అయినా ఇప్పటివరకూ 29 లక్షల టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా ఇస్తామన్న పరిమాణంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భౌతిక తనిఖీల కోసం కేంద్రం ప్రతినిధులు తెలంగాణకు వెళ్లిన క్రమంలో స్టాక్‌ నిర్వహణ సరిగా లేదని తేలింది. ధాన్యం లెక్కలను సరిగ్గా నిర్వహించట్లేదని వెల్లడైంది. ఈక్రమంలో తెలంగాణ ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూపోయింది. కేంద్రం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రక్రియ. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల మేరకే కొంటున్నాం. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదు. ప్రస్తుతం కొనసాగుతున్న విధంగానే కనీస మద్దతు ధర కొనసాగుతుందని పార్లమెంట్‌లోనే వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. అయినా ఒకే మాటను పలు విధాలుగా మాట్లాడుతున్నారు. దానికి కారణం నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ముందు ముందు ఇస్తానన్న 29 లక్షల టన్నులు ఇంకా పెండింగ్‌ ఉంది. దానిని ఇంకా అప్పగించలేదు. దానిని సరఫరా చేసి ఇంకా ఏమైనా ఉంటే కేంద్రంతో మాట్లాడాలి. ఎంఓయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'-పీయూష్‌ గోయల్‌, కేంద్రమంత్రి

ఒడిశాలో ఎక్కువగా ఉన్న ఉప్పుడు బియ్యం నిల్వలను ఎఫ్​సీఐ (FCI) తీసుకోవాలని బీజేడీ ఎంపీ సస్మిత్‌ పాత్రా కోరారు. తెలంగాణలో రైతులు రబీ కోసం సాగుకు సిద్ధమయ్యారని తెరాస ఎంపీ సురేష్‌ రెడ్డి తెలిపారు. ఉప్పుడు బియ్యంపై కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

suresh reddy mp: 'గత నాలుగైదు ఏళ్లలో నీటిపారుదల రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల వరి సాగు గణనీయంగా పెరిగింది. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని సభలో కేంద్రమంత్రి చెబుతున్నారు. కానీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి ప్రతి గింజ కొంటామని చెబుతున్నారు. రెండేళ్ల కోసం దేశానికి సరిపడా పారాబాయిల్డ్‌ నిల్వలు ఉన్నాయని భావిస్తే పంట వేయవద్దని చెప్పండి. ఇప్పటికే రబీ కోసం రైతులు సాగు పనులు మెుదలుపెట్టారు. రబీలో పారాబాయిల్డ్‌ రైస్‌ మాత్రమే వస్తుంది. రబీలో ధాన్యం సేకరణ చేపడతారా లేదా?' -సురేశ్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు

paddy procurement from telangana: ఉప్పుడు బియ్యం ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అంగీకరించిందని తెలిపిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌... పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని ఇవ్వలేదని తెలిపారు.

'ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కర్ణాటక నమూనా అనుసరిస్తే బాగుంటుంది. ఫ్రూట్స్‌ పేరిట కర్ణాటక అవలంభిస్తున్న విధానంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సాగు లెక్కను పక్కాగా నమోదు చేస్తున్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన 29 లక్షల టన్నుల ధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు ఐదు సార్లు గడువు పొడగించాం. అయినా స్టాక్‌ ఇవ్వలేదు. పారా బాయిల్డ్‌ బియ్యం విషయంలోనూ 24.75 మెట్రిక్‌ టన్నులు ఇస్తామని చెప్పారు. దీనిపై పలు మార్లు విజ్ఞప్తి చేస్తే ఒకేసారి 44.75 మెట్రిక్‌ టన్నులు తీసుకునే విధంగా అంగీకరించాం. అందులో కూడా 27.78 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఒప్పందం ప్రకారమే ఇంకా 17 లక్షల మెట్రిక్‌ టన్నులు పెండింగ్‌లో ఉంది. ఒప్పుకున్నది ఇవ్వకుండా భవిష్యత్‌ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పారా బాయిల్డ్‌ బియ్యం ఇవ్వబోమని తెలిపింది. సమగ్ర విధానం తేవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పారా 8 ప్రకారం రాష్ట్రాలు వినియోగించేవి మాత్రమే మేం సేకరిస్తాం. దీనిని ముందే సూచించాం. వారు గతం, భవిష్యత్తు కలుపుతున్నారు. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐకి పారా బాయిల్డ్‌ బియ్యం ఇవ్వబోమని అక్టోబర్‌ 4 2021 తెలంగాణ ప్రభుత్వం స్వయంగా లేఖ ఇచ్చింది. అయినా ప్రస్తుతం ఉన్న పంటను కొనుగోలు చేస్తాం. అయినా పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావట్లేదు. 17 లక్షల టన్నులను సరఫరా చేయండి. ఇప్పటికే ముఖ్యమంత్రితో ఈ అంశంపై మాట్లాడాను. - పీయూష్‌ గోయల్‌, కేంద్రమంత్రి

ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానంతో సంతృప్తి చెందని తెరాస సభ్యులు.....రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇదీ చూడండి:TRS MPs in Parliament Today: 'ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇస్తే మా రైతులకు చెబుతాం'

Last Updated : Dec 3, 2021, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details