నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రజలకు మంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్న దృష్ట్యా... రైతుల నుంచి కూడా ఆ ధాన్యమే సేకరిస్తామని తేల్చిచెప్పారు. రాబోయే యాసంగి నుంచి దొడ్డు వడ్లు కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ చిరుధాన్యాల సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డీడీజీ సంజయ్‌శర్మ, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విలాస్.ఎ.తొనాపి, న్యూట్రీ హబ్ సీఈవో బి.దయాకర్‌రావు, శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు, పరిశ్రమ వర్గాలు పాల్గొన్నాయి. వర్చువల్ వేదికగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి హాజరయ్యారు.
దేశంలో ఆహార భద్రత సాధించినప్పటికీ... పోషకాహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, అదనపు విలువ జోడింపు, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, విదేశీ ఎగుమతులు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి తోమర్ ప్రకటించారు. ఈ విషయంలో చిన్న, సన్నకారు రైతులు, శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు, పరిశ్రమ, వ్యాపార వర్గాలు ఒకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే రైతుల ఆదాయాలు మరింతగా పెరుగుతాయని స్పష్టం చేశారు. "ఆయిల్‌పామ్ మిషన్" కింద రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.