KTR Fires on Mansukh Mandaviya: బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా.. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో చేసిన ప్రకటనపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘మన్ సుఖ్ మాండవీయ పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు.
భారతదేశ లైఫ్ సైన్సెస్ హబ్‌కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకుండా దేశానికి తీరని అన్యాయం చేశారు. జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే భాజపా ప్రాధాన్యం ఇస్తుంది. కేంద్ర మంత్రి అబద్ధాలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారు. ఆయనపై లోక్‌భలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నా. తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి మాండవీయ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
లోక్‌సభలో మాండవీయ ఏమన్నారంటే:టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందిస్తూ... ‘‘దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఒక్కోదానిపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. ఇందుకు కొన్ని కొలమానాలు పెట్టి రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల నుంచి రాగా వాటిని పరిశీలించాం.
హైదరాబాద్ ఫార్మా పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమని సభ్యుడు చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు రూ.వెయ్యి కోట్లు లభిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌ల్లోనూ ఈ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. ఇప్పటికే వాటికి ప్రాథమికంగా రూ.300 కోట్ల చొప్పున ఇచ్చాం’’ అని చెప్పారు. అయితే సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆమోదించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: