KISHAN REDDY: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో గడిచిన రెండు రోజులుగా బయటకు కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. తెరాస దిగజారుడు రాజకీయలు చేస్తోందని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి నేర్చుకోండంటూ తెరాస నేతలు చెబుతున్నారని.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని నేర్చుకోవాలో, కుటుంబ పాలన నేర్చుకోవాలో చెప్పాలని కిషన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోందని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలన్న దానిపైనే కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోందని కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నారు. కుటుంబ పాలన పార్టీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. భాజపా తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని.. కుటుంబ పార్టీకి కాదని స్పష్టం చేశారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో గడిచిన రెండు రోజులుగా బయటకు కనిపిస్తోంది. రాష్ట్రంలో తెరాస దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. తెలంగాణలో అభివృద్ధిని చూసి నేర్చుకోండంటూ తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని నేర్చుకోవాలా, కుటుంబ పాలన నేర్చుకోవాలో చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోంది.-కిషన్రెడ్డి, కేంద్రమంత్రి
మరోవైపు హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తెరాస తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిందని కిషన్రెడ్డి ఆరోపించారు. ప్రతి ఇంటికి రూ.10 వేల చొప్పున పంచారన్నారు. అయినా ప్రజలు భాజపా అభ్యర్థినే గెలిపించారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే తెరాస ఆధారపడుతుందన్న కిషన్రెడ్డి.. దీనికి వ్యతిరేకంగా భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు. కుటుంబపాలనపోయి.. భాజపా అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలూ కోరుకుంటున్నారని తెలిపారు.