తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy Special Interview : 'ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారత్‌' - ఈటీవీ భారత్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటర్వ్యూ

Kishan Reddy Special Interview : ప్రపంచంలో కరోనా మహమ్మారి నుంచి అత్యంత వేగంగా కోలుకుని.. మెరుగైన స్థితికి చేరుకుంది ఒక్క భారతదేశ పర్యాటకమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే భారత్‌ను ప్రపంచ పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని తెలిపారు. ఈ మేరకు కొత్త పర్యాటక విధాన ముసాయిదా సిద్ధమై.. ప్రధానమంత్రి మోదీ కార్యాలయానికి చేరిందని.. అతి త్వరలోనే కొత్త దశ, దిశలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే కృష్ణానదిపై సోమశిల వద్ద నిర్మించబోతున్న భారీ తీగల వంతెన శంకుస్థాపనకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలలో ఒకరు వస్తారని వివరించారు. శ్రీనగర్‌లో నేటి నుంచి మొదలుకానున్న జీ-20 పర్యాటక సదస్సు నేపథ్యంలో ఆయన 'ఈనాడు-ఈటీవీ భారత్‌'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..

Etv Bharat
Etv Bharat

By

Published : May 22, 2023, 8:18 AM IST

  • కరోనాతో తీవ్రంగా దెబ్బ తిన్న పర్యాటకం ఇప్పుడు ఎలా ఉంది..?

Kishan Reddy Special Interview : కరోనా మహమ్మారి వల్ల ఎక్కువగా ప్రభావితం అయినవి పర్యాటకం, ఆతిథ్య రంగాలే. ఇవి ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఉదాహరణకు 2022లో కశ్మీర్‌లో 1.84 కోట్ల మంది పర్యటించారు. శ్రీనగర్‌ విమానాశ్రయంలో రోజుకు 90 విమానాలు రాక పోకలు నడిపాయి. అదే లేహ్‌లో.. 2020 జనవరిలో వారానికి 74 విమానాలు రాకపోకలు సాగించగా.. 2022 అక్టోబర్‌ నాటికి ఆ సంఖ్య 160కి చేరింది. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వృద్ధి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సమగ్ర, సుస్థిర పర్యాటకం కోసం త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకు వస్తున్నాం. అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం, ప్రకృతి పర్యాటకానికి డిమాండ్‌ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, ఆరోగ్యం, పోచంపల్లి వంటి గ్రామీణ పర్యాటక ప్రాంతాలకు ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించాం.

  • శ్రీనగర్‌లో జీ-20 పర్యాటక సదస్సు పెట్టడంలో ప్రత్యేకత ఏంటి..?

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే జీ-20 సదస్సులకు దాదాపు లక్ష మంది వరకు విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సులు విదేశీ పర్యాటకుల రాక పెరిగేందుకు దోహదం చేస్తాయి. దాదాపు 34 ఏళ్ల అనంతరం కశ్మీర్‌లో నా అధ్యక్షతన అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నాం. అక్కడి పరిస్థితుల వల్ల కొన్నాళ్లు కుంటుపడిన పర్యాటకం.. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. హీరో రామ్‌చరణ్‌ రేపు ఈ సదస్సులో పాల్గొంటారు.

  • ఎక్కువ మందికి ఉపాధిని ఇచ్చే పర్యాటక రంగానికి కేంద్రం ఎలాంటి సహకారం అందిస్తోంది..?

ఆతిథ్య రంగ అనుబంధ విభాగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్ పరిమితిని రూ.4.50 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచడంతో ఈ రంగంపై ఆధారపడిన వారికి అందరికీ లబ్ధి చేకూరింది. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.లక్షల కోట్లు కావాలి. ఇందుకు ప్రైవేటు సంస్థల నుంచి పెట్టుబడులు రావాలి. దేశ చరిత్రలో తొలిసారిగా 'గ్లోబల్‌ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌'ను త్వరలోనే దిల్లీలో నిర్వహించబోతున్నాం.

  • తెలంగాణ, ఏపీల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న ప్రణాళికలు ఏంటి..?

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో కేంద్రం కీలక పాత్ర పోషించింది. ఆ ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.67 కోట్లు ఇస్తోంది. అలంపూర్‌ జోగులాంబ శక్తి పీఠంలో సౌకర్యాల కోసం రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అవి ఈ సెప్టెంబర్‌లో పూర్తవుతాయి. భద్రాచలం ఆలయంలోనూ రూ.42 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. రామప్ప ఆలయ సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకుల కోసం హైదరాబాద్‌ నుంచి హెలీ ట్యాక్సీ ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం సహకరిస్తే తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధికి ఎంతమేరకైనా సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిని గతేడాది యునెస్కో గుర్తింపు కోసం పంపాం. అలాగే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నెలకొల్పిన శాంతినికేతన్‌కు ఈ సంవత్సరం యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం. ఏపీలో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌కు రూ.24.14 కోట్లు, రెండు కోస్తా సర్క్యూట్లకు రూ.117.39 కోట్ల నిధులు ఇచ్చాం. లంబసింగి, అరకు, గండికోట ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details