Kishan Reddy on ORR Lease Controversy : హైదరాబాద్ ఔటర్ రింగ్ 30 ఏళ్ల లీజు అంశంపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్ లీజు టెండర్లలో గోల్‌మాల్ జరిగిందంటూ ఇటీవల ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించగా.. బంగారు బాతు ఓఆర్‌ఆర్‌ను తక్కువ ధరకే అమ్మేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాజాగా ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రానికి తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించడం సరైంది కాదన్నారు.
Hyderabad ORR Lease Controversy : ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓఆర్‌ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ బేస్ ప్రైస్ ప్రకారం చూసుకున్నా.. 30 ఏళ్లలో ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకు పైగా వస్తుందన్నారు. ఏటా 5 నుంచి 10 శాతం టోల్ రుసుం పెరిగితే రూ.70 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా పెరిగి.. టోల్ ఆదాయం ఇంకా ఎక్కువ వస్తుందని పేర్కొన్నారు.
పుణె-బాంబే ఎక్స్‌ప్రెస్ హైవేను 10 ఏళ్ల కాలానికే రూ.8,875 కోట్లకు లీజుకు ఇచ్చారన్న కేంద్రమంత్రి.. 30 ఏళ్లలో రూ.లక్షల కోట్లలో ఆదాయం వచ్చే హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డును మాత్రం కేవలం రూ.7,380 కోట్లకే ముంబయికి చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు అప్పజెప్పారని మండిపడ్డారు. వస్తున్న ఆదాయానికి తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఈ ప్రభుత్వం ఉండదనే ఉద్దేశంతో అతి తక్కువకే లీజుకు ఇచ్చారని విమర్శించారు.
''ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలు చేసుకునే హక్కును 30 ఏళ్లకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కేటాయించారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుత బేస్‌ప్రైజ్ ప్రకారం చూసుకున్నా ప్రభుత్వానికి 30 ఏళ్లల్లో రూ.30 వేల కోట్లకు పైగా వస్తుంది. భవిష్యత్‌లో వాహనాల సంఖ్య భారీగా పెరిగి టోల్ ఆదాయం ఇంకా ఎక్కువ వస్తుంది. అలాంటిది 30 ఏళ్లలో రూ.లక్షల కోట్లలో ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను కేవలం రూ.7,380 కోట్లకే ఇచ్చారు. ఎలాగూ ఈ ప్రభుత్వం ఉండదనే ఉద్దేశంతో అతి తక్కువకే లీజుకు ఇచ్చేశారు.'' - జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి