బల్దియా రాజకీయాల్లో పెనుమార్పు కోసం భాజపా ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విధ్వంసం లేని రాజకీయాలనే తమ పార్టీ కోరుకుంటుందన్న ఆయన... 'ఛేంజ్ హైదరాబాద్ టుడే... ఛేంజ్ తెలంగాణ టుమారో' అనేదే తమ నినాదమని తెలిపారు. సికింద్రాబాద్‌లో చేపట్టిన 'ఛేంజ్ హైదరాబాద్' మార్పు కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని.... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్యతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. భాజపాకు అవకాశమిస్తే భాగ్యనగర రూపురేఖలు మారుస్తామని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
"దేశంలో 80 శాతం మున్సిపల్ కార్పొరేషన్లలో, 17 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. మా పాలనలో అరాచకం కొనసాగుతుందని చెప్పడం దుష్ప్రచారమే. విధ్వంసాన్ని కూకటివేళ్లతో పెకలించే పార్టీ భాజపా. మాపై అరాచకం, విధ్వంసం అనే ముద్రలు వేయడం సరికాదు. తెరాస, ఎంఐఎం పార్టీలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాయి. మాది మాటల రాజకీయం కాదు.. చేతల రాజకీయం."
-కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి