తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదాయం కోసం ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది: కిషన్​రెడ్డి - Fire accidents

Kishan Reddy inspected Swapnalok complex: ప్రతిష్ఠాత్మకమైన సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణ, అస్తి నష్టం వాటిల్లడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాల వల్ల కాంప్లెక్స్, అపార్ట్​మెంట్స్​ వాసులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ప్రతి ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన స్వప్నలోక్ కాంప్లెక్స్​ను ఆయన పరిశీలించారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Mar 19, 2023, 2:26 PM IST

Kishan Reddy inspected Swapnalok complex: సికింద్రాబాద్‌లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్‌ కాంప్లెక్స్‌ను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎక్కువ ఆదాయం వస్తోందని ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని జీహెచ్​ఎంసీ అధికారులు చెబుతున్నారని.. తర్వాత మర్చిపోతున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. నగరంలో గోదాంలు, స్క్రాప్‌ దుకాణాలను జీహెచ్​ఎంసీ అధికారులు తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రమాదాలకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన అన్నారు. ప్రమాదాలకు తావున్న గోదాంలను శివారు ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

జనావాసాల మధ్య స్క్రాప్ గోదాములు ఉంచకూడదని అన్నారు. ప్రభుత్వం ఫైర్ సిబ్బందిని, అధునాతన యంత్రాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస ప్రమాదాల వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నగరంలో ఉన్న పాత అపార్ట్​మెంట్స్​పై పర్యవేక్షణ చేయాలని సీఎస్​కు లేఖ రాస్తానని తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్​కు లేఖ కూడా రాశానని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా కమిటీలు వేసి.. ఆ తర్వాత మరచిపోతున్నారని ఆయన విమర్శించారు. స్వప్నలోక్​ బిల్డింగ్ విషయంలో నిపుణులు ఏది సూచిస్తే ప్రభుత్వం అది అమలు చేయాలని కిషన్​రెడ్డి సూచించారు.

"ప్రతి ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన యువత కలలు మంటల్లో కాలిపోయాయి. జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ప్రమాదాలు జరిగితే గానీ చర్యలు తీసుకోవడం లేదు. జనావాసాల మధ్య స్క్రాప్ షాపులు ఉండకూడదు. ప్రభుత్వం ఫైర్ సిబ్బందిని, అధునాతన యంత్రాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలి. సిబ్బంది తక్కువగా ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక శాఖకు కొత్తగా వచ్చిన పరికరాలు సమకూర్చాలి. ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోంది. ఎక్కువ ఆదాయం వస్తుందని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు అడిగే సంస్థల గురించి నిరుద్యోగ యువత మాకు సమాచారం ఇవ్వాలి. ప్రమాదంపై ప్రధానితో మాట్లాడి ఆర్థిక సహాయం కోరాను. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్​గ్రేషియా ప్రకటించారు". కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details