kishan reddy on musi floods: రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే.. 4 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రగతిభవన్ దాటి బయటికి రాని కేసీఆర్.. ఇప్పుడు దిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మూసీ పరివాహకంలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ముసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన ఆయన.. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టింది తప్పితే.. ఒక్క అడుగైనా ముందుకు వేయలేదన్నారు. విపత్తు వేళ ఉపయోగించుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ట్ర సర్కార్ విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు.