తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజమైన హైదరాబాద్‌ అంటే హైటెక్‌ సిటీ కాదు.. సికింద్రాబాద్‌ వంటి బస్తీలు'

Kishan Reddy Visit Nalas Works: హైదరాబాద్‌ అభివృద్ధి అంటే హైటెక్‌ సిటీలకు దారి వేయడం కాదు.. బస్తీలను అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పించడమే హైదరాబాద్‌ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట్‌లోని నాలాల పనులను పరిశీలించి.. అసంపూర్తిగా ఉండటంపై మండిపడ్డారు.

central minister kishan reddy
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

By

Published : Feb 19, 2023, 7:19 PM IST

Kishan Reddy Visit Nalas Works: ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మియాపూర్‌, హైటెక్‌ సిటీలో రోడ్లు, ఫ్లైఓవర్లు వేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనుకుంటే ఎలా అనీ.. నిజమైన హైదరాబాద్‌ అంటే అవి కాదని బస్తీల్లో ఉందని మొదట వాటిని అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నగరంలోని అంబర్‌పేట నల్లకుంటలోని పాత రామాలయం బస్తీలో జరుగుతున్న నాలా పనులను కేంద్రమంత్రి పరిశీలించారు.

హైదరాబాద్‌ నగరంలోని బస్తీల్లో నాలా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నల్లకుంట, అంబర్‌పేట, గౌలిపురా, ఓల్డ్‌సిటీ, సికింద్రాబాద్‌ వంటి బస్తీలు నిజమైన హైదరాబాద్‌ అని వ్యాఖ్యానించారు. ఈ బస్తీలను బాగుచేస్తే నిజమైన హైదరాబాద్‌ సాకారం అవుతుందన్నారు. రాబడుల్లో హైదరాబాద్‌ నుంచి రూ.లక్షల కోట్లు ఆదాయం వస్తున్న.. బడ్జెట్‌లో కేవలం రూ.30కోట్లను మాత్రమే కేటాయించారని విమర్శించారు. దీనివల్ల బస్తీల్లో మౌలిక వసతుల కల్పన కుంటుపడుతోందని అన్నారు.

ఈ బస్తీల్లో మూసీ నదిలో కలిసే నాలాలు వర్షాకాలంలో ఓవర్‌ ఫ్లో అవ్వడంతో నాలాలు పొంగి మురుగు నీరు బస్తీల్లోకి వచ్చేస్తుందని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు, స్లాబ్‌ వేయించానని.. చిన్న నాలా పూడికపడడం వల్ల భవిష్యత్తులో వర్షాలు ఎక్కువగా పడితే ఇళ్లల్లోకి నీరు చేరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా మెయిన్‌రోడ్డు వెంట డ్రైనేజ్‌ తీసుకువెళ్లి మూసీ నదిలో కలపాలని అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరానన్నారు. జీహెచ్‌ఎంసీ వద్ద నిధులు లేక ఈ పనులు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని... అందువల్ల పనులు నెమ్మదించాయని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నగరంలో రూ.1200కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు వంతుల జనాభాకు ఒక వంతు జనాభా హైదరాబాద్‌ మహానగరంలోనే ఉందన్నారు. నిధులు లేక మౌలిక వసతులు కల్పించకపోవడంతో బస్తీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

"హైదరాబాద్‌ నగరంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించే సంస్థలు జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ వర్స్స్‌ నిధులు లేక కుదేలవుతున్నాయి. నిధుల కొరత కారణంగా దివాళా దీసే పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌ అంటే బస్తీల్లో ఉంది. నిజమైన హైదరాబాద్‌ అంటే ఇదే." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

నిజమైన హైదరాబాద్‌ అంటే హైటెక్‌ సిటీ కాదు.. సికింద్రాబాద్‌ వంటి బస్తీలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details