Kishanreddy: తెలంగాణలో హింసను ప్రోత్సహించే విధంగా కొందరు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ సైతం సైనికుల పట్ల చులకనగా మాట్లాడారని పేర్కొన్నారు. సైన్యంలో చేరాలనుకునేవారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం విచారకరమన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అగ్నిపథ్ పథకం ఎంతో కీలకమైందని అనేక దేశాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. సైన్యంలో చేరాలనుకునేవారు ఇలా కేంద్ర ఆస్తులను తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. కుట్రలో భాగంగా వారిని కొందరు తప్పుదోవ పట్టించారని.. లేకుంటే చర్చలతో సమస్య పరిష్కారం అయ్యేదని తెలిపారు.
భాజపా పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో ఒక్క పైసా అవినీతి జరగలేదని తెలిపారు. దేశ హితం కోసం రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హజరుకావాలన్నారు. జులై1 నుంచి 3వరకు భాజపా జాతీయ మహాసభలు జరగనున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.