Kishan Reddy Fires on BRS : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 12 అంశాలపై లేఖాస్త్రాలు సంధించారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు సహాకరించాలని... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరారు. సైనిక్ స్కూల్, సైన్స్ సిటీ కోసం భూమి కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. రైల్వేల పురోగతికి సహాకరించాలని లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల కోసం బీజేపీని విమర్శించండి.. కానీ పెండింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్రానికి సహాకరించాలని కోరారు.
కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్‌కి చిత్తశుద్ధి ఉంటే తాను లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కేంద్రం 1250 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమాకు మెట్రో డీపీఆర్ మంజూరయినట్టు వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఫలక్‌నుమా వరకు రావాల్సిన మెట్రోను అఫ్జల్‌గంజ్ వద్దే ఆపారని... పాత నగరానికి మెట్రో రాకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.
'ఎంఎంటీఎస్ రెండో విడతపై రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆలస్యం వల్ల ఎంఎంటీఎస్ రెండో విడత ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖకు జరిగిన ఒప్పందం పాటించట్లేదు. మెట్రో పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. రాష్ట్రంలో రైల్వేలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.720 కోట్లు మంజూరు.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి