హైదరాబాద్ హిమాయత్ నగర్ కూడలీ వద్ద వీయర్ మాస్క్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు, ప్రజలకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మాస్కులను పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ స్ట్రైయిన్ ప్రారంభమైందని... అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని కోరారు. వృద్ధులు, పిల్లలు బయటికి రాక పోవడమే మంచిదని... తప్పనిసరి అయితేనే ప్రజలు మాస్కులు ధరించి బయటికి రావాలన్నారు. కరోనా స్ట్రైయిన్ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
మాస్కులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదచారులకు పంపిణీ
యూసఫ్ గూడ బస్తి నుంచి గణపతి కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ మాస్క్లు పెట్టని పాదచారులకు, దుకాణదారులకు కిషన్ రెడ్డి మాస్కులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అలర్టై ప్రజలకు చైతన్యం కల్పించాలని కోరారు. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయాణికుల వివరాలు కేంద్రం పంపించిందని పేర్కొన్నారు. చలికాలం ఉన్నకారణంగా ఫిబ్రవరి వరకు ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, వృద్దులు, చిన్న పిల్లలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మాస్క్లు పంపిణీ చేస్తున్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావు, జూబ్లీహిల్స్ భాజపా సీనియర్ నాయకులు లంకా దీపక్ రెడ్డి, జూబ్లీహిల్స్ భాజపా కన్వీనర్ ప్రేమ్ కుమార్, అట్లూరి రామకృష్ణ, భాజపా కాంటెస్టెడ్ కార్పొరేటర్ కుంబాల గంగరాజ్, కోలన్ వెంకటేష్, కోలన్ సత్యనారాయణ, వి.ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్), డివిజన్ అధ్యక్షులు చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :పీవీ దేశాన్ని సమూలంగా మార్చిన తపస్వి: వెంకయ్య