హుజూరాబాద్‌లో తెరాస ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే... సీఎం కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy press meet) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారన్న కిషన్‌రెడ్డి.... అబద్ధాల భవనం మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సకల జనులు సర్వస్వం త్యాగం చేస్తే తెలంగాణ ఆవిర్భవించిందన్న కేంద్రమంత్రి... దళితులు ముఖ్యమంత్రిగా పనికి రారా..? అని ప్రశ్నించారు.
'ప్రతి గింజా కొంటాం'
బాయిల్డ్ రైస్ తప్పా మిగతావి కొంటామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. రైతులకు బాయిల్డ్ రైస్‌కు ఎటువంటి సంభంధంలేదని... ధాన్యం పండించడం వరకే రైతుల బాధ్యత అని అన్నారు. వివాదం కానీ అంశాన్ని సమస్య చేశారన్న కిషన్ రెడ్డి (kishan reddy today news).. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని ఆయన పునరుద్ఘాటించారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని కేసీఆర్(cm kcr news) చెబుతున్నా... కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వ్యాఖ్యానించారు. పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తే తప్పేంలేదన్న కిషన్‌రెడ్డి.. మరి మన రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.
పర్యాటక కేంద్రంగా పోచంపల్లి
ఉత్తమ పర్యాటక విజిటింగ్ గ్రామంగా భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామని కేంద్రమంత్రి తెలిపారు. యునెస్కో వెబ్సైట్లోనూ పొందుపరిచారని వెల్లడించారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చామని పేర్కొన్నారు. తన కృషి ఫలితంగా శ్రీరామ సర్క్యూట్‌ను అయోధ్య నుంచి భద్రాచలం వరకు పొడిగించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజాద్ కా అమృత్ మహాత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు.