Rozgar Mela is organiz in Secunderabad : రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉద్యోగ నియామకాల్లో అవకవకలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రోజ్గార్ మేళాలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నెల 16, 17, 18 తేదీల్లోని ఒకరోజు రోజ్గార్ మేళాను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి తెలియజేశారు. సికింద్రాబాద్ ఎస్వీఐటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనా అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల శాఖల్లో సుమారు 71,000 యువతకు నియామకాలు చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్లో కొత్తగా ఎంపికైన వారిని ఆయన అభినందించారు.
నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది : కేంద్ర ప్రభుత్వం యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగాలు నియామకం చేస్తోందని పేర్కొన్నారు. దాదాపు పది లక్షల మంది యువతకు దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టి వేగవంతంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. నోటిఫికేషన్లో పొందుపరిచిన విధంగానే పరీక్షలను వేగంగా నిర్వహించి సకాలంలో యువతకు నియామక పత్రాలు ఇస్తున్నామని అన్నారు.
ఉద్యోగ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఈ మేళాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉద్యోగంలో ఎంపికైన వారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదములు తెలియజేశారు. యువత కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని.. నిరుద్యోగులకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు.