One Week One Lab in Hyderabad: వెదురు పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అన్నారు. గతంలో వెదురు కోసం చైనా, కొరియా, జపాన్ల మీద ఆధారపడేవాళ్లమని... ఇప్పుడు ఆయా దేశాలు పన్ను పెంచడంతో వెదురు పరిశ్రమను అభివృద్ది చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ వెదురును ఉపయోగించే అగరవత్తులు తయారు చేస్తున్నామని తెలిపారు. తార్నాక సీఎస్‌ఐఆర్, ఐఐసీటీ ఆడిటోరియంలో నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'వన్ వీక్ వన్ ల్యాబ్' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.
శాస్త్రవేత్తలు కొంత రిస్క్ తీసుకోవాలి : ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి జితేందర్ సింగ్.. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికత వల్లే నేడు వెదురు పరిశ్రమ వృద్ధి చెందిందన్నారు. భారత్ అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్న జితేందర్ సింగ్.. మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని వివరించారు. అనంతరం భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. సమాజ అవసరాల కోసం శాస్త్రవేత్తలు సాహసోపేత ప్రయోగాలు చేయాలని అన్నారు. వ్యక్తిగత ప్రాజెక్టులే కాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆవిష్కరణల్లో దేశం ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు కొంత రిస్క్ తీసుకోవాలని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.