Nitin Gadkari Hyderabad Tour: అమెరికా తరహా హైవేలు తెలంగాణలో నిర్మాణమవుతాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు అనుసంధానిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్‌లో 12 జాతీయ రహదారుల విస్తరణ పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జీఎంఆర్ ఎరీనా వద్ద హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి.. అనంతరం ఇప్పటికే పూర్తయిన రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. ఏడు సీఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాంసాన్ పల్లి నుంచి మంగళూరు వరకు 4 వరుసల రహదారిని జాతికి అంకితమిచ్చారు.
తెలంగాణ ప్రగతిశీల రాజ్యం: దేశంలో మొత్తం 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామని గడ్కరీ అన్నారు. వాటిలో 5 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు తెలంగాణ మీదుగా వెళ్తాయని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు రూ. 3 లక్షల కోట్లతో హైవేల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యమన్న గడ్కరీ... ప్రగతి సాధించాలంటే నీరు, విద్యుత్, రహదారులు, కమ్యూనికేషన్ ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని గడ్కరీ అన్నారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే దేశంలోనే అతి పెద్దదని.. ఈ హైవే ద్వారా ముంబయి నుంచి దిల్లీకి 12 గంటల్లోనే చేరుకుంటామని వెల్లడించారు.
"తెలంగాణలో 2014లో 2,511 కి.మీ మేర హైవేలు మాత్రమే ఉండేవి. భాజపా అధికారంలోకి వచ్చాక 4,996 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఎనిమిదేళ్లలో మేము మరో 2,450 కి.మీ హైవేల నిర్మించాం. రానున్న రోజుల్లో మరింత వేగంగా హైవేల నిర్మాణం చేపడతాం. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యం. పెట్టుబడులు లేకుండా మనం అభివృద్ధి సాధించలేం. అభివృద్ధి సాధించకుండా మనం పేదరికాన్ని నిర్మూలించలేం."-నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి
అంతకుముందుగా సభలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణకు ప్రగతికి జాతీయ రహదారులు కీలకమనని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతోనే తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. పెండింగ్ ప్రాజక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
సింహభాగం హైవేలకే: తెలంగాణలో అద్భుతంగా రహదారుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో హైవేల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పెర్కొన్నారు. రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో వందశాతానికిపైగా రోడ్ల నిర్మాణం జరిగిందన్న ఆయన.. రహదారుల కోసం రూ.1.04 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతోందని తెలిపారు. జాతీయ రహదారులకు మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్న కిషన్ రెడ్డి.. బడ్జెట్‌లో సింహభాగం హైవేల నిర్మాణానికి కేటాయించారని వెల్లడించారు.