Union Minister On Mahila Samman Savings Certificate: దేశంలో మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు పెద్ద ఎత్తున చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళుతోందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హ్ జేసింగ్ భాయ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో జరిగిన 2023-24 సంవత్సరం సంబంధించి తెలంగాణలో ప్రత్యేక క్యాంపియన్‌లో భాగంగా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రామచంద్ర మిషన్ ఛైర్మన్, ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన గురువు డాక్టర్ కమలేశ్ డీ పటేల్- దాజీ సమక్షంలో కేంద్రం, తపాలా శాఖ ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రత్యేక కవర్ కేంద్రమంత్రి విడుదల చేశారు. పలువురు మహిళలకు తపాలా శాఖ పొదుపు ఖాతా పాస్ పుస్తకాలు అందజేశారు.
మహిళా సమ్మాన్ పొదుపు పథకం: ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రాంతీయ పోస్టు మాస్టర్ జనరల్ పీ.విద్యాసాగర్, విశ్రాంత అటవీ శాఖ ఉన్నతాధికారి సక్సెనా, ఇతర తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, కన్హా శాంతి వనం ద్వారా విశేష సేవలందిస్తున్న కమలేశ్ పటేల్ ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. మహిళా సమ్మాన్ పొదుపు పథకం మహిళలకు అత్యంత లాభదాయకమైన పెట్టుబడుల్లో ఒకటిగా ఈ సంవత్సరం ప్రారంభమైందని ఆయన అన్నారు.