తెలంగాణలో 3.80మెట్రిక్ టన్నుల యూరియా(urea fertiliser), 45,000మెట్రిక్ టన్నుల డీఏపీ(D.A.P) అందుబాటులో ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా(Bhagwanth Khuba) వెల్లడించారు. ఎన్పీకే 3.29లక్షల మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 55,600మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 5 ఫర్టిలైజర్(Fertiliser) కంపెనీలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. వీటితో 12,70,000 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ భాజపా(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు సమీక్ష
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సమస్యల పరిష్కారం కోసం అక్కడ పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఏడేళ్లల్లో ఏ ప్రాంతానికీ ఎరువుల కొరత రానీవ్వలేదని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఎంత ఎరువులు కేటాయించాలో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. లెక్కలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కేంద్రమంత్రి వివరించారు. వ్యవసాయశాఖ మంత్రులు అధికారులతో రోజు సంప్రదిస్తున్నామని... ప్రతి మంగళవారం ఇక్కడి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
నేతలతో సమావేశం
నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. సీనియర్ నేతలు, కార్యకర్తలు కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. అందుబాటులో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.