తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతిక లోపంతో అమిత్ షా విమానం ఆలస్యం.. రాష్ట్ర రాజకీయాలపై నేతలతో చర్చ - Union Minister Amit Shah latest news

హైదరాబాద్‌లో అమిత్‌ షా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 11.50గంటలకు కేరళకు వెళ్లాల్సి ఉంది. పర్యటన ఆలస్యం కావడంతో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారితో అమిత్ షా చర్చించారు.

Amit Shah
Amit Shah

By

Published : Mar 12, 2023, 4:02 PM IST

Updated : Mar 12, 2023, 5:49 PM IST

హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణించే విమానం సాంకేతిక లోపానికి గురైంది. హాకీంపేటలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం 54వ వ్యవస్ధాపక దినోత్సవంకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. నిన్న రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అధికారిక కార్యక్రమం అనంతరం.. ఉదయం 11:50 గంటలకు హాకీంపేట విమానాశ్రయం నుంచి కేరళ రాష్ట్రం కొచ్చికి బయల్దేరాల్సి ఉంది.

రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చ: కానీ ఈ క్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. అమిత్ షా కేంద్ర పారిశ్రామిక భద్రతా అకాడమీలోనే నిలిచిపోయారు. మరో విమానం వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్‌తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన అమిత్ షాకి బండి సంజయ్ ఒక నోట్ అందించినట్లు సమాచారం. ఆయన అందించిన నోట్‌పైన లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో రావడానికి అవకాశం ఉందని.. నేతలు మరింతగా కలసికట్టుగా పని చేస్తే అధికారం తథ్యమని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర నాయకుల పనితీరుకు కితాబు ఇచ్చిన షా.. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం 3:30 గంటలకు అమిత్ షా మరో విమానంలో కొచ్చికి బయల్దేరారు.

అంతకు ముందు అమిత్ షా సీఐఎస్​ఎఫ్​ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో ఏర్పాటు చేసిన రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కేంద్ర పారిశ్రామిక దళానిది కీలకపాత్రని అమిత్ షా తెలిపారు. 3,000 మంది సిబ్బందితో 1969 మార్చి 10న ప్రారంభమై.. నేడు 1,80,000 మందికి చేరుకుందని వివరించారు. నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, జాతీయ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్ షా స్పష్టం చేశారు.

వాషింగ్‌ పౌడర్‌ 'నిర్మా.. వెల్‌కమ్‌ అమిత్‌ షా' ఫ్లెక్సీల కలకలం:హైదరాబాద్‌లో అమిత్‌ షా పర్యటన వేళ వాషింగ్‌ పౌడర్‌ 'నిర్మా.. వెల్‌కమ్‌ అమిత్‌ షా' అంటూ వాల్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలు, వెలిశాయి. బీజేపీ నేతలు సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, వంటి పలువురు నేతలతో ఉన్న ఫ్లెక్సీలు నగరంలో దర్శనమిచ్చాయి. అవినీతి ఆరోపణలు ఉన్న వారు.. బీజేపీలో చేరగానే అన్ని మరకలు పోయాయంటూ అర్థం వచ్చేలా వీటిని ఏర్పాటు చేయించారు. మరోవైపు నిన్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ సందర్భంగా ఇదే తరహాలో పోస్టర్లు కన్పించాయి. తాజాగా ఈ ఫ్లెక్సీలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.

ఇవీ చదవండి:దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో CISF కీలక పాత్ర: అమిత్​ షా

స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు ఇవ్వలేం: కేంద్రం

Last Updated : Mar 12, 2023, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details