నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అర్వింద్‌పై దాడిని ఆయన ఖండించారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అర్వింద్ అమిత్ షాకు వివరించారు.
రాష్ట్రంలో భాజపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అధికార తెరాస పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అర్వింద్ అమిత్ షాకు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగినా తనపై దాడులు జరపాలని తెరాస నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అమిత్‌షాకు తెలిపారు.
ఇదీ జరిగింది..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.