Amit Shah Will Meet Leaders Of Telangana BJP National Working Committee: తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో కేంద్రమంత్రి అమిత్ షా నేడు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై అడిగి తెలుసుకోనున్నారు. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయని అధిష్ఠానం భావిస్తోంది. బీఆర్‌ఎస్ సర్కార్‌పై పోరాటం చేస్తూనే.. రాష్ట్రానికి ఏం చేస్తున్నామో.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు.
మార్చి నుంచి పోలీంగ్ బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు దిల్లీకి రావాలని సూచించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షాతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డి భేటీలో పాల్గొనున్నారు.
బీజేపీ యాక్షన్ ప్లాన్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. ఎన్నికలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీయనున్నారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు, దిల్లీ మద్యం కుంభకోణం వల్ల ఆ పార్టీకి అనుకూల, ప్రతికూల పరిస్థితులేంటి, దీని వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో సింపతీ పొందే అవకాశాలున్నాయా అనే అంశాలపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.