తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ అమిత్​ షా హైదరాబాద్​ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన అమిత్‌షాకు... భాజపా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అమిత్‌షా బేగంపేట నుంచి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

amith shah
amith shah

By

Published : Nov 29, 2020, 12:01 PM IST

Updated : Nov 29, 2020, 1:02 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న అమిత్‌షాకు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.

అమిత్‌షా బేగంపేట నుంచి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్దకు భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చాయి. చార్మినార్ వద్ద భాజపా శ్రేణులకు అమిత్ షా అభివాదం చేశారు. అమిత్ షా పర్యటన దృష్ట్యా చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న షా... ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట బండి సంజయ్, రాజాసింగ్, ఇతర భాజపా నేతలు ఉన్నారు.

హైదరాబాద్ పర్యటన సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని, అమ్మ ఆశీస్సులు అందుకున్నాను. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించాను. భాగ్యలక్ష్మి అమ్మవారు, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను.

- అమిత్​ షా ట్వీట్​

అనంతరం వారాసిగూడాకు బయలుదేరారు. వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండి వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం రోడ్డు షో ముగించుకొని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం వరకు భాజపా నేతలతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణంకానున్నారు.

బల్దియా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో... అమిత్‌షాను భాజపా రంగంలోకి దింపింది. ఆఖరి రోజు అమిత్ షా ప్రచారం మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

ఇదీ చదవండి :ఓటుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే!

Last Updated : Nov 29, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details