Nirmala Sitharaman Fires On Telangana Government: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెరాస ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. తెరాస హయాంలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తే చుక్క నీరూ రాలేదని నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు.
తెరాస సర్కారు నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ మంత్రాలు, తంత్రాలు అనే నెపంతో సచివాలయానికి వెళ్లలేదని ఆమె విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేయని కేసీఆర్.. దేశాన్ని అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో తెరాస ఆవిర్భవించిందన్న ఆమె.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు నినాదాలతో తెరాస ప్రజల ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. కుల రహిత సమాజం నిర్మించడమే తెరాస లక్ష్యం అన్నారని పేర్కొన్నారు. కానీ 2014 నుంచి 2018 వరకు మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించలేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.