తెలంగాణ

telangana

ETV Bharat / state

Doubling Farmers Income: రైతుల ఆదాయం పెరిగిందెక్కడ?.. ఆ హామీ ఏమైంది? - doubling farmers income news

Doubling Farmers Income: 2022 నాటికి అన్నదాతల ఆదారం రెట్టింపుచేస్తామని కేంద్రం నాడు ప్రకటన చేసినా.. కేంద్ర బడ్జెట్​లో ఆ ప్రస్తావన ఎక్కడా వినబడలేదు. రైతు ఆదాయం రెట్టింపు (డీఎఫ్‌ఐ) ఎలా చేయాలనే అంశంపై కేంద్రం 2015లో జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఒక్కో రాష్ట్రంలో రైతుల ఆదాయమెంత, 2022-23 నాటికి ఎంతకు పెరగాలో గణాంకాలతో వివరించింది. అనంతరం ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగలేదు.

budget impact on farmers
farmer

By

Published : Feb 2, 2022, 5:56 AM IST

Doubling Farmers Income: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పిన గడువు రానేవచ్చింది. కానీ, తాజా బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. రైతు కుటుంబం నెలవారీ ఆదాయం సగటున 2015-16లో రూ.8,059 ఉన్నట్లు కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇది రెట్టింపు కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఏడాది అది రూ.21,146కి చేరాలి. కానీ, 2018-19లో కేంద్రం జరిపిన అధ్యయనం ప్రకారం రూ.10,218 మాత్రమే ఉంది. 2015-19 మధ్య నమోదైన పెరుగుదల వృద్ధి రేటుతో లెక్కించినా ప్రస్తుతం (2022లో) ఆదాయం రూ.12,955 దాటదు. జాతీయ నమూనా సర్వే ప్రకారం చూస్తే రైతులు పంటలపై వచ్చే ఆదాయం కన్నా రోజుకూలీపై వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు తేలిందని వివరించింది.

2015లో డీఎఫ్‌ఐ కమిటీ ఏర్పాటు

‘రైతు ఆదాయం రెట్టింపు’(డీఎఫ్‌ఐ) ఎలా చేయాలనే అంశంపై కేంద్రం 2015లో జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఒక్కో రాష్ట్రంలో రైతుల ఆదాయమెంత, 2022-23 నాటికి ఎంతకు పెరగాలో గణాంకాలతో వివరించింది. వాటి ప్రకారం.. తెలంగాణలో 2015-16లో రైతు కుటుంబ ఆదాయం సగటున రూ.86,291 ఉంది. ఇందులో పంట సాగుపై వచ్చింది రూ.63,492 కాగా, మిగతాది ఇతర పనులు చేయడం వల్ల సంపాదించింది. ప్రస్తుత ధరల ప్రకారం ఇది 2022-23కల్లా రూ.2,01,431కి పెరిగితే రెట్టింపైనట్లు అవుతుందని కమిటీ తెలిపింది. ఇందులో పంటల సాగుపై రూ.1,56,522, మిగతాది ఇతర పనులపై రావాలి. ఇదే కాలవ్యవధిలో ఏపీలో రూ.1,04,092 నుంచి రూ.2,33,876కు పెరగాలి. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు.

నిర్దిష్ట పథకాల్లేవు

రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం నిర్దిష్ట పథకాలేవీ పెద్దగా అమలు చేయలేదు. దీనికితోడు ఇప్పటికే ఉన్న పలు వ్యవసాయాభివృద్ధి పథకాలకు నిధుల విడుదల చాలావరకూ తగ్గిపోయింది. రైతుల ఆదాయం పెరగాలంటే అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగాలని డీఎఫ్‌ఐ కమిటీ 2015లోనే సూచించింది. 2015-16 నుంచి ప్రైవేటు పెట్టుబడుల వృద్ధి రేటు ఏటా 6.62 శాతం ఉండాలంది. అంటే 2015-23 మధ్యకాలంలో ఏడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు రూ.46,300 కోట్లు రావాలి. ఇక ప్రభుత్వ పెట్టుబడుల వృద్ధిరేటు ఏటా రూ.6.92 శాతం ఉండాలి. అంటే ప్రభుత్వాలు రూ.1,02,300 కోట్ల పెట్టుబడి పెట్టాలి. వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది ఇంకా ఎక్కువ ఉండాలి.

కొనుగోలు మద్దతు ఏదీ?

ధాన్యం తప్ప మిగతా పంటలను కొనే విషయంలో కేంద్రం నుంచి సహకారం లేదని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఆరోపించినా సమాధానం లేదు. వరి తప్ప పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు రాష్ట్ర దిగుబడిలో 25 శాతమే కొంటామని కేంద్రం షరతు పెట్టింది. దీనివల్ల వాటికి ధరల్లేక రైతులు నష్టపోయినా ఆదుకునే పరిస్థితి లేదు. కేంద్రం 2020-21లో 1.97 కోట్ల మంది రైతుల నుంచి మద్దతు ధరలకు పంటలను కొనగా.. 2021-22లో 1.63 కోట్ల మంది నుంచే కొన్నారు.

కేటాయింపులు తగ్గించారు

కేంద్ర బడ్జెట్‌ మొత్తం నిధుల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2021-22లో 3.97 శాతం కేటాయించగా.. 2022-23 బడ్జెట్‌లో 3.51 శాతానికి తగ్గించారని రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో గుర్తించినట్లు వేదిక ప్రతినిధి విస్సా కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయానికి రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినా గత 20 నెలల్లో కేవలం రూ.6,627 కోట్ల విలువైన ప్రాజెక్టులకే అనుమతి ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు కేంద్రం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.

ఇదీచూడండి:Union budget 2022: కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి మొండిచెయ్యి

ABOUT THE AUTHOR

...view details