తెలంగాణను ఎవరూ విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టంచేశారు. కరోనా సమయం నుంచి తెలంగాణకు కేంద్రం సముచిత న్యాయం చేసిందని ఆయన వివరించారు.
హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్... కొవిడ్ సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే నిత్యావసర సరకులు అందించామని అన్నారు. మోదీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా బడ్జెట్‌ను రూపొందించిందన్న అనురాగ్... ఇది అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో కలిసి మాట్లాడుతామని తెలిపారు. నీతీ ఆయోగ్ సూచన మేరకే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని అనురాగ్ పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తున్నామని... అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది సరైందికాదని చెప్పారు.