Allocation to Telangana in Budget: వైజాగ్ స్టీల్‌ప్లాంట్, సింగరేణి బొగ్గు గనులకు మినహా కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులేమీ కనిపించలేదు. ఐఐటీలు, ఐఐఎంలు, ఐసర్‌లు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్లకు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నింటికీ కలిపి ఉమ్మడిగా నిధులు ప్రకటించినందున ఏపీ, తెలంగాణల్లోని సంస్థలకు ప్రత్యేకంగా ఎన్ని నిధులు వస్తాయన్నది స్పష్టత లేదు. ఉన్నత విద్యాసంస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ నుంచి రుణాలు తీసుకొని చెల్లిస్తున్నందున వీటికి సంస్థల వారీగా నిధులను చూపలేదు.
- వైజాగ్ స్టీల్‌కు రూ.910 కోట్లు ప్రకటించారు. 2021-22లో ఈ సంస్థకు రూ.595 కోట్లు కేటాయించి, అంచనాల సవరణ నాటికి రూ.730 కోట్లకు పెంచారు.
- ఇరు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు ఇచ్చారు. వీటికి గత బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ తర్వాత రూ.13.37 కోట్లకు పడిపోయింది.
- సింగరేణి కాలరీస్‌కు ఈసారి రూ.2వేల కోట్లు కేటాయించారు. నిరుడు రూ.2,500 కోట్లుగా పేర్కొన్నా, సవరించిన అంచనాల నాటికి రూ.2వేల కోట్లకు కుదించారు.
- హైదరాబాద్ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్‌కు రూ.374.25 కోట్లు ప్రకటించారు. దీనికి గత బడ్జెట్‌లో రూ.4.69 కోట్లు కోతపడింది.
- హైదరాబాద్ ఐఐటీ (ఈఏపీ)కి రూ.300 కోట్లు కేటాయించారు. పాత బడ్జెట్‌లో రూ.150 కోట్లు ప్రకటించినా తుదకు రూ.230 కోట్లకు పెంచారు.
- హైదరాబాద్ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డుకు రూ.19 కోట్లు ప్రకటించారు. గతేడాది తొలుత రూ.23.84 కోట్లుగా పేర్కొని, రూ.18.04 కోట్లకు తగ్గించారు.
- దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొన్న సమరయోధులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమం, పింఛన్ల కోసం రూ.688.14 కోట్లు కేటాయించారు.
- హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు రూ.135.46 కోట్లు కేటాయించారు.
- సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్)కు రూ.150 కోట్లు ప్రకటించారు.
రక్షణ రంగం బలోపేతంతో హైదరాబాద్‌కు లబ్ధి