దేశంలో వ్యవసాయ సంస్కరణల పేరిట లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. రైతుల ఆదాయాలు పెంపు దృష్ట్యా.. కనీస మద్దతు ధరలు, వ్యవసాయోత్పత్తుల సేకరణ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో రూ.16 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సంస్థ భవనం, న్యూట్రిసెరెల్స్ ఇన్నోవేషన్ సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అతిథి గృహం భవనాలను దిల్లీ నుంచి వర్చువల్ వేదికగా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డీడీజీ టీఆర్ శర్మ, జాతీయ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ విలాస్ .ఎ. తొనాపి, న్యూట్రీ హబ్ డైరెక్టర్ డాక్టర్ దయాకరరావు, పలు రాష్ట్రాల పరిశోధన సంస్థల అధిపతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం దృష్ట్యా వర్షాధార ప్రాంతాల్లో అపార అవకాశాలు గల చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తోమర్ పేర్కొన్నారు. తద్వారా చిరుధాన్యాల విప్లవం సాధించవచ్చని తెలిపారు. అత్యంత పౌష్టిక విలువలు గల కొర్రలు, సామలు, తైదలు, రాగులు, జొన్న, సజ్జలు ఇతర చిరు ధాన్యాలు ఆహారం రూపంలో ప్రతి ఇంట్లోకి తీసుకురాగలిగితేనే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆసుపత్రులకు దూరంగా ఉండటం అన్న లక్ష్యం నెరవేరినట్లవుతుందని స్పష్టం చేశారు.